ఋషి వంటి సంసారి ... మా కృష్ణ మావయ్య


ఋషి వంటి సంసారి ... మా కృష్ణ మావయ్య
నమ్మబుద్ధి కావటం లేదు...
నమ్మక తప్పటం లేదు...
శ్రీ ఆకెళ్ళ సూర్యనారాయణ గారి
ఆఖరు అబ్బాయి
సహోద్యోగులకు గోపాల్
సన్నిహితులకు కృష్ణ
మా అందరికీ ....
ప్రియమైన ‘కృష్ణ మావయ్య’
ఈయన....వెళ్ళిపోయారు....
***
తను
మా నలుగురు మేనమామలలో
ఆఖరి వాడే కాదు
చిట్టచివరి వరకు
తన పై వారి అందరి కుటుంబాలలోని
మంచి, చెడ్డలకు అండగా నిలచిన
పెద్దదిక్కు కూడా...
***
చిరునవ్వును వీడని వాడు
విసుగెన్నడు చూపని వాడు
పల్లెత్తు మాటలాడని వాడు
పరులనెపుడు నిందించని వాడు
బాధలకు బెదరని వాడు
బాధ్యతలకు వెరవని వాడు...
సంసారి గా కనిపిస్తూనే
సన్యాసిగా జీవించినవాడు...
***
యవ్వనంలో కమల్ హాసన్ గా కనిపించి
తన కమ్మని  పాటలతో
మాకు ఆరాధ్యుడుగా మారినా,  
వయసు పెరిగే కొద్దీ
అయ్యప్ప మహిమాన్విత
భక్తి పారవశ్య దీక్షలో మునిగి,  
తన రూపంలోనూ, గానంలోనూ,
భక్తిభావం లోనూ
మా ఇంటి జేసుదాస్ గా మారాడు
అనడంలో అతిశయోక్తి లేదు...
***
నిత్యం రైల్వే యంత్రాల మధ్య కఠోర శ్రమలో
అలసిపోయిన సహోద్యోగులకు తన
అయ్యప్ప గీతాల గాన మాధుర్యం పంచినా,
స్కౌట్ సేవా పతాకాన్ని ఎగురవేసి,
ఎందరికో ప్రథమ చికిత్స రూపంలో
ప్రాణదానం చేసి
జాతీయ స్థాయిలో పతకాలు సాధించినా,
బంధువులు, స్నేహితుల ఇళ్ళలో
కష్టానికి ఆపద్బాంధవుడుగా మారినా,
శుభకార్యాలలో పెద్దగా వ్యవహరించినా
తన చుట్టూ ఉన్న వారి ఆనందంలోనే
తన ఆనందాన్ని,
వారి సంతోషం, సంతృప్తి లోనే
తన సంతృప్తిని వెతుక్కొని
ఒక మహనీయ మానవుడిగా
మిగిలిపోయాడు మావయ్య...
***


ఉద్యోగంలోని కఠోర శ్రమను  
చెరగని చిరునవ్వుతోనూ
విషాదకర విధి వంచనలను
ఆధ్యాత్మిక శక్తితోనూ ఎదుర్కొన్న
మా మావయ్యకు
మరణాన్ని ఎదుర్కోవడం
పెద్ద కష్టం కాదు.. కానీ
ఎందుకనో చాలా తొందరపడి
వెళ్లిపోయాడు....
నిత్యం భగవంతుని సేవలో, పూజలో,
దీక్షలో, యజ్ఞంలో, యాగంలో, గడిపిన
తన మీద అభిమానంతో
భగవంతుడు తొందరపడి
తీసుకెళ్ళిపోయాడేమో అంతే...
...
నిజం...
కళ్ళెదుట లేకున్నా
బ్రతికున్నంత కాలం
గుండెల నిండా నిలచిపోయే
గొప్ప జ్ఞాపకం మా మావయ్య...
తన గురించి చెప్పడానికి
ఈ పదాలు చాలడం లేదు...
కానీ.. ఏం చెయ్యను...
కన్నీళ్లు ఆగడం లేదు మరి...
-----
(A Tribute to my Maternal uncle Sri ASRV Gopala Krishna who demised on 28-2-2019
నూజిళ్ళ శ్రీనివాస్
Date: 03-3-2019

Comments

Popular posts from this blog